భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని నిజాంపేట మండల విద్యాధికారి యాదగిరి సూచించారు. చదువుతోపాటు సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే విద్యార్థులు మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోగలరని తెలిపారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ ఫౌండేషన్ డే సందర్భంగా రామాయంపేటలోని నిజాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమయపాలన, సేవా దృక్పథం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవడతాయని యాదగిరి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తాయని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదిగి, భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో KGBV ప్రత్యేక అధికారి రాణి, మెదక్ జిల్లా గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ జ్యోత్స్న, స్కౌట్ కెప్టెన్ జ్యోత్స్న, సునీత, విలియమ్స్ ట్రూప్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.