భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పిల్లల భద్రతకు గ్రామస్థాయిలో ప్రత్యేక కమిటీలు

మేచరాజుపల్లి పెద్దతండాలలో విసిపిసి కమిటీలు ఏర్పాటు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లలపై జరిగే నేరాలను అరికట్టి, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి, పెద్దతండ గ్రామాల్లో శనివారం ICDS సూపర్వైజర్ జలగం సునీత ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCPC) ఏర్పాటు చేశారు.

మేచరాజుపల్లి గ్రామ కమిటీకి స్థానిక సర్పంచ్ తూర్పాటి శంకర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పెద్దతండ కమిటీ కన్వీనర్‌గా బాదావత్ సుధారాణి సురేష్‌ను ఎంపిక చేశారు. రెండు గ్రామాల్లోనూ మరో 15 మంది చొప్పున సభ్యులను కమిటీల్లో నియమించారు.

మేచరాజుపల్లి పెద్దతండాలలో విసిపిసి కమిటీలు ఏర్పాటు..

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో సూపర్వైజర్ జలగం సునీత మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడం, బాల్యవివాహాలను అరికట్టడం, బాలల అక్రమ రవాణాను నిరోధించడం, శారీరక, మానసిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడం వంటి అంశాల్లో VCPC కమిటీలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులకు బాలల భద్రత, హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో బాలలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కమిటీలు కృషి చేస్తాయని వివరించారు.

బాలికలకు, పిల్లలకు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా సహాయం కోరాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చని తెలిపారు. పిల్లల రక్షణ విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు రాయపురం సరోజన, మోరపోజు లీలావతి, MD మహబూబి, ఎల్తూరి సునీతతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.