భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

36

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: పుట్టుకతో వచ్చే హృద్రోగాలను ముందుగానే గుర్తించి, సమయానికి శస్త్రచికిత్స చేయించడం ద్వారా పిల్లలకు కొత్త జీవితం ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో సత్య సాయి హాస్పిటల్స్ (సిద్దిపేట జిల్లా) సహకారంతో ఆర్ బి ఎస్ కే వైద్యాధికారుల ద్వారా గుర్తించిన కాంజెనిటల్ హార్ట్ డిసీజెస్ (పుట్టుకతో వచ్చే హృద్రోగ సమస్యలు) పై ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్.బి.ఎస్. కె సిబ్బంది హృద్రోగ సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో 36 మంది పిల్లలకు హృద్రోగ పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి హృదయ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే సిద్ధిపేట జిల్లా సత్యసాయి హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సత్యసాయి ఆసుపత్రి హృద్రోగ వదిద్యుడు డా. జగన్నాథ శర్మ మాట్లాడుతూ కాంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అనేది పిల్లలు పుట్టినప్పటి నుంచే హృదయంలో ఉండే నిర్మాణ లోపం వల్ల వస్తుందని, ఇది హృదయంలోని రక్తనాళాలు, వాల్వులు లేదా గోడలలో ఉండే లోపాల వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం వలన ఉత్పన్నమవుతుందనీ అన్నారు. శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, వేగంగా అలసిపోవడం, పెరుగుదల మందగించడం, పెదవులు, గోళ్లు నీలి రంగులోకి మారడం (సయానోసిస్) వంటి లక్షణాలు ఉన్నాయన్నారు. స్వల్ప లోపాలు ఉన్నవారికి సాధారణ మందులు లేదా పర్యవేక్షణ సరిపోతుందని, తీవ్రమైన లోపాలు ఉన్నవారికి శస్త్రచికిత్స అవసరం అవుతుందన్నారు. సమయానుకూలంగా చికిత్స పొందితే పిల్లలు ఆరోగ్యంగా సాధారణ జీవితం గడపగలుగుతారని చెప్పారు.

మరిన్ని కథనాలు: 

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది: ఎమ్మెల్యే మేఘారెడ్డి