భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం జిల్లాలోని కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు సకాలంలో సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియలో అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రతి రోజు స్వీకరించిన పత్రాలను భద్రపరచి, సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నామినేషన్లపై రోజువారీ నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు. ఈ పరిశీలనలో జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్డివో విజయలక్ష్మి, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ అరుణతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్