భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లింగాల నాగరాజు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. గురువారం హాస్టల్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం వసతి గృహంలోని బాలికలకు ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వార్డెన్ నిర్లక్ష్యం వలన ఇవ్వడం జరగడం లేదని అన్నారు. పెరుగుకు బదులుగా పలచని మజ్జిగ అందించడం వల్ల విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. మెనూ ప్రకారం భోజనం ఏదీ సరిగ్గా అందించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో నాలుగు బాత్రూములు ఉన్నప్పటికీ, కేవలం రెండు బాత్రూముల్లో మాత్రమే నీరు వస్తోందని, తొమ్మిది గదుల్లో ఒక్క గదిలో మాత్రమే విద్యుత్ ఉండటంతో విద్యార్థినులు రాత్రిళ్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. వార్డెన్ ఒక్కరోజు కూడా హాస్టల్‌కు హాజరుకాకపోవడం అత్యంత నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు హాస్టల్లో ఉండి చదువు కొనసాగిస్తారని నమ్మి తల్లిదండ్రులు వారిని అప్పగిస్తే, వార్డెన్లు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అంగీకారయోగ్యం కాదన్నారు. జిల్లాలోని హాస్టళ్లలో పిల్లలకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, పర్యవేక్షణ లోపం వంటి విషయాల్లో బాధ్యులైన వార్డెన్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను ఆయన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
BHARATH SAMACHAR DIGITAL
21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్