భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2026, సోమవారంభారత్ సమాచార్

ప్రతి వార్డును అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దడమే లక్ష్యం

2984e4b8-8189-49a4-9ecf-89f56849ebac

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇస్నాపూర్, చిట్కుల్, లకడారం వార్డుల్లో రూ.3 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

నాణ్యతతో.. వేగంగా పనులు

శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాండు, నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, సంధ్య నవీన్ రెడ్డి, కిషోర్ రెడ్డి, వెంకటేష్, ఈశ్వరమ్మ, జనార్ధన్ రెడ్డి, ఆంజనేయులు, మమత అరుణ్, రాజు, లత వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, సోనియా రాజు, నిజాముద్దీన్ బాబా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.