భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం కోలూరు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు సోమవారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికీ వెళ్లి వాహనాలను తనిఖీ చేయడంతో పాటు వాటికి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా పరిశీలించారు. సరైన వాహన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపులో పోలీసులకు సహకారం అందుతుందని తెలిపారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.
గంజాయి వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్ వంటి సామాజిక సమస్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని సూచించారు. రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరించి, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఏఎస్పీ సూచించారు.
ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సాయి కిరణ్ కోరారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై జుబేర్, ఇతర ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.