భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

జిన్నారంలో ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

WhatsApp Image 2026-08-30 at 11.59.02 AM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు, మాల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సొంత నిధులు కేటాయిస్తూ అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని అన్నారు. జిన్నారం ప్రజల భక్తి విశ్వాసాలకు అనుగుణంగా పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని తెలిపారు.

ఆలయ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం తనవంతుగా రూ.12 లక్షల భారీ విరాళాన్ని అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో జిన్నారం ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు, నిర్వాహకులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రాజేష్, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మాల సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడి నెలకొంది.