భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ఆదిలాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలో రూ. 260.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు. రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపన, రూ.19.69 కోట్లతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.2కోట్లతో మహాలక్ష్మివాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరించనున్నట్లు పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు మౌలిక సదుపాయాల కల్పన కోసం పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, రూ. 2.6 కోట్లతో 3 ఇంటెలిజెన్స్ విభాగానికి క్వార్ట్రర్స్, రూ. 2 కోట్లతో భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పట్టణాభివృద్ధికి, పరిశ్రమల పురోగతికి, ప్రజల దైనందిన జీవన విధానానికి అత్యంత కీలకమైన అంశం స్థిరమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో రూ. 231.24 లక్షల నిధులతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 33/11 KV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.