భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు రూపకల్పన, పరంజాలపై క్షేత్ర సందర్శనలో భాగంగా ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. నిర్మాణంలో కాంక్రీటుకు కావాలసిన ఆకారాన్ని ఇవ్వడానికి ఉపయోగించే ఫార్మ్ వర్క్ (రూపకల్పన), నిర్మాణ పనులలో ఎత్తులో ఉన్న ప్రదేశాలకు చేరడానికి, పనిముట్లు కార్మికులకు ఇవ్వడానికి ఉపయోగించే పరంజా (Scaffolding)ల గురించి గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో స్వీయ అనుభవాన్ని గడించారు. వాస్తవ సమయంలో ఫార్మ్ వర్క్, స్కాఫోల్డింగ్లపై లోతైన అవగాహనను పొందారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమిత్ భట్టాచార్య, తపతి తపన్విత భంజా మార్గదర్శనంలో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ఈ క్షేత్రస్థాయి సందర్శనను నిర్వహించారు. ఫార్మ్ వర్క్ పద్ధతులను స్వయంగా చూడటానికి, ఇందులో ఉన్న భాగాలను అధ్యయనం చేయడంతోపాటు వాస్తవ నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే పద్ధతులను అన్వేషించడానికి ఈ క్షేత్ర సందర్శన విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కలప, ఫ్లైవుడ్, లోహంతో సహా వివిధ రకాల ఫార్మ్ వర్కులను విద్యార్థులు పరిశీలించి, నిర్దిష్ట నిర్మాణ అవసరాల ఆధారంగా వాటిని ఎలా ఎంచుకుంటారో తెలుసుకున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనాన్ని సందర్శించడం ద్వారా విద్యార్థులు సిద్ధాంతం, అభ్యాసం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించగలిగారు. లోడ్ బదిలీ విధానాలు, మద్దతు వ్యవస్థలు, నిర్మాణ క్రమం వంటి కీలకమైన అంశాలపై వారి అవగాహనను మెరుగుపరచుకున్నారు. ఈ ఆచరణాత్మక అనుభవం తరగతి గది అభ్యాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా, భవన నిర్మాణ పరిశ్రమకు అవసరమైన కచ్చితత్వం, ప్రణాళిక, సాంకేతిక నైపుణ్యం పట్ల వారి అవగాహనను మరింత పెంచింది.