భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

Vallabhaneni Vamsi Mohan: గన్నవరం @పొలిటికల్ ఫైర్

Vallabhaneni-Vamsi

భారత్ సమాచార్, కృష్ణా జిల్లా: వల్లభనేని వంశీ.. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇంట్రడక్షన్‌ అక్కర్లేని పేరు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రత్యర్థి పార్టీలపై తన మార్క్ కామెంట్స్‌తో హీట్ క్రియేట్ చేసేవారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు అయ్యాయి. వంశీ కూడా రిమాండ్‌లో చాలా కాలం ఉండాల్సి వచ్చింది. అసలు ఒక దశలో వంశీకి బెయిల్ వస్తుందా? రాదా అనుకునే పరిస్థితి ఏర్పడింది. జైలులో కొన్ని నెలలు గడిపిన అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ పొలిటికల్ లైఫ్‌పైనా రూమర్స్ క్రియేట్ చేశారు. వాటన్నింటినీ వంశీ పటాపంచలు చేస్తున్నారు. ఇంతకీ వంశీ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..

 

తొలిసారి గెలిచి రెండోసారి ఓటమి చవిచూసి:
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కీలక నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్‌గా చేసుకుంది. చాలా మంది వైఎస్‌ఆర్‌సీపీ మంత్రులు కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి చేరిపోయారు. మరికొందరు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇంకొందరు వివిధ ఆరోపణలు, కేసులతో జైలుకు కూడా వెళ్లిన పరిస్థితి. అలాంటి నేతలలో ఒకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ . ఏపీ రాజకీయాల్లో దూకుడుతో వల్లభనేని వంశీ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనటంలో అతిశయోక్తి కాదు. 2014లో గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనంలోనూ గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన వివిధ రాజకీయ పరిణామాలలో వల్లభనేని వంశీ వైఎస్‌ఆర్‌సీపీకి చేరువయ్యారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరుఫున పోటీ చేసిన ఓడిపోయారు. దీంతో, వంశీ పనైపోయిందని ప్రత్యర్థులు భావించారు.

 

అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా తగ్గలేదు:
ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్‌గా కాస్త ఇన్ యాక్టివ్‌గా ఉంటూ వచ్చిన వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్ట్ కాగా.. ఆ తర్వాత పలు కేసులు చుట్టుముట్టడంతో 2025 ఫిబ్రవరి నుంచి జులై రెండో తేదీ వరకూ విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే జులైలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వల్లభనేని వంశీ టార్గెట్‌గా పలు స్టోరీలు వండివార్చారు. ఒకానొక దశలో అయితే.. వంశీ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ రాజకీయాలలో యాక్టివ్‌గా లేరని ఆ ఆసక్తి ఆయనకు లేదంటూ ప్రచారం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆయన పొలిటికల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో జగన్ మోహన్ రెడ్డితో కలిసి పంట నష్టాలను పరిశీలించడమే కాదు, వైఎస్సార్‌సీపీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించారు.

 

నిర్భంధించి చిత్రహింసలు పెట్టి:
ప్రత్యర్థులు కూడా నాలుగు నెలల పాటు జైల్లో నిర్భందిస్తే వంశీ పనైపోతుందనుకున్నారు. వంశీపై కేసులు పెట్టి మానసికంగా కుంగదీస్తే, రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతాడనుకున్నారు. తనను టార్గెట్ చేసి రాజకీయంగా వేధిస్తే తన బలమైన అనుచరగణం కూడా రాజకీయాలు వదిలేస్తారనుకున్నారు. కానీ ఇలా జరిగితే తను వంశీ ఎలా అవుతాడు. రాజకీయ ఓనమాలు దిద్దుతున్న సమయంలోనే రాజకీయ ఉద్ధండులతో తలపడిన నేపథ్యం అతనిది, ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేసిన చరిత్ర అతనిది. వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు, అనుచరులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారే తన బలంగా తన ప్రజా జీవితాన్ని నిర్మించుకున్న నాయకత్వం అతనిది. నియోజకవర్గ ప్రజలు యావత్తూ మా వంశీ గారికి చెబితే పని అయిపోతుంది అనే ఒక నమ్మకం, విశ్వాసాన్ని ఏర్పరుచుకున్న నేత వంశీ. బెయిల్ వచ్చాక కొద్ది కాలం ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా, ఇంటికే పరిమితమై కోర్టు కేసులపైనే వంశీ పుల్ ఫోకస్ చేశారు. ఒక దశలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీని వదిలి, రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటారని రూమర్స్ వచ్చాయి. అయితే, ఇటీవల వంశీ పర్యటనలు చూస్తుంటే.. తనపై వస్తున్నవన్నీ గాసిప్స్ అని ప్రజలే అంటున్నారు.

 

నిరంకుశత్వాన్ని ఎదిరించి నిర్భయంగా నిలబడి:
వంశీ ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా టిడిపి ప్రభుత్వం మానవత్వం చూపలేదు. బెయిల్ వస్తుందన్న సమయంలో మరో కేసు పెట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడింది. వంశీ విడుదలకు ముందు ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సంబంధమే లేని కేసుల్లో ఇరికించి వంశీని జైళ్లోనే ఉంచాలన్న టిడిపి కుట్రలు విఫలమయ్యాయి. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేధించాలన్న టిడిపి లక్ష్యం నెరవేరలేదు. ఆంక్షలు, కటకటాలు బద్దలు కొట్టుకుని.. వైరి పక్షం కుట్రలను ఛేదిస్తూ.. ప్రజల అభిమానమే తనకు కవచంగా వంశీ తిరిగి ప్రజా జీవితంలో యాక్టివ్ అయ్యారు. పూర్తి స్థాయిలో ప్రజలకు, కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా వాలిపోతున్నారు.పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను, కార్యకర్తలను ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు. డబ్బే ప్రధానంగా రాజకీయాల్లోకి వచ్చి, డబ్బుతో గెలిచిన ప్రత్యర్ధికి, ప్రజాసమస్యలే ప్రధాన ఏజెండాగా, ఎమోషనల్ కనెక్ట్ తో రాజకీయాలు చేసే వంశీకి ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ 18 నెలల కాలంలో తామేం నష్టపోయామో తెలుసుకుంటున్నారు. మరో వైపు తమను నడిపించే నాయకుడు పూర్తి జోష్ తో నియోజకవర్గాన్ని చుట్టేస్తుండడంతో కార్యకర్తలు ఎమోషనల్ అవుతున్నారు. తమకు భరోసా కల్పించే నాయకుడు నిరంకుశత్వాన్ని ఎదురిస్తూ తమ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నిలబడుతున్నాడని ఎమోషనల్ అవుతున్నారు.

 

రెడ్‌బుక్ రాజ్యాంగానికి తలొగ్గకుండా:
అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. వంశీ విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. వంశీని పూర్తిగా రాజకీయాలకు దూరం చేయాలనుకున్న టిడిపి ఆశలు నెరవేరలేదు. 137 రోజుల పాటు తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించిన టిడిపి ప్రభుత్వం.. వంశీ పట్టుదలను మరింత పెంచింది. ప్రస్తుతానికి ప్రత్యర్ధుల కుట్రల పై వంశీ మౌనం వహిస్తున్నా.. నిత్యం ప్రజల్లో తిరగడం ద్వారా టిడిపి రెడ్ బుక్ రాజ్యాంగానికి తలవంచే వ్యక్తిత్వం తనది కాదని చెప్పకనే చెబుతున్నాడు. వైసీపీ రాష్ట్ర స్థాయిలో పిలుపునిస్తున్న కార్యక్రమాలను, పోరాటాలను నియోజకవర్గంలో చేపడుతూ ప్రజల పక్షంగా పనిచేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నియోజకవర్గ ప్రజలను వంశీ చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఇప్పటివరకూ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 43 వేలమంది సంతకాలు చేశారు.

 

బక్కచిక్కి సన్నగిల్లినా ప్రజాసంక్షమం వైపే:
ప్రజలను వంశీ కలవటానికి వెళ్లినప్పుడు బాగా సన్నబడి.. జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో వంశీ కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. గూడూరు ప్రాంతంలో జగన్‌తో కలిసి కారులో పంట నష్టాలను పరిశీలించిన వంశీని చూసి, పాలిటిక్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారని టాక్ వచ్చింది. 138 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి విడుదల అయ్యాక.. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ రూమర్స్ వచ్చాయని సన్నిహితులు అన్నారు. ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో పూర్తి క్లారిటీ వచ్చాకే వంశీ ప్రజల్లోకి వచ్చారని చెబుతున్నారు.

 

గన్నవరంలో అధికార పార్టీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోయాయి. ఇసుక, మద్యం, మైనింగ్ ను ఒక ఆదాయవనరుగా మార్చుకుని అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనిలోనూ కమిషన్లు, ప్రభుత్వ పథకాలు రావాలన్నా కూడా నేతలకు డబ్బు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ప్రజా సమస్యలను గాలికోదిలేసి, అవినీతి సంపదను పొగుచేసుకోవడంలో అధికార పక్షం తలమునకలయ్యింది. అధికార పక్ష అరాచకాలను, అసమర్ధతపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కూటమి ప్రభుత్వం పై పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని కోల్పోతున్నారు. గత పాలనలో ఇంటివద్దకే సంక్షేమం, పైసా ఖర్చు లేకుండా పొందిన ప్రభుత్వ సేవలు నేడు కనుమరుగయ్యాయి. కష్టం వినగానే స్పందించి, పరిష్కరించే నేత వంశీ లాంటి నేతను తిరిగి గెలిపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.