భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

అన్ని ప్రచార కార్యక్రమాలపై నిషేధం: కలెక్టర్ ప్రావీణ్య

d14ac10e-6956-4e4a-9360-be038a7e8c99

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీ.ప్రావీణ్య తెలిపారు. రెండవ విడత ఎన్నికలు జరుగనున్న ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు.

మూడవ విడత ఎన్నికలు జరగనున్న కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపారు. ప్రతి విడతకు సంబంధించి 44 గంటల సైలెన్స్ పీరియడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, శబ్ద ప్రచారం, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషేధించ బడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించాలని ఆమె కోరారు.