భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండల, గ్రామ కేంద్రంలో ఉన్న స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దీనిని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు స్వర్ణ, కాంస్య, రజిత పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు కందిమల్ల దామోదర్ మాట్లాడుతూ.. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలతో ప్రపంచ స్థాయిలో గొప్ప గణిత శాస్త్రవేత్తలలో ఒకరుగా నిలిచారని పేర్కొన్నారు. వారి మేథాశక్తితో విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమాన్వయకర్త (కరస్పాండెంట్) తుమ్మలపల్లి వెంకటరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మహేష్, వెంకట్, మోయినుద్దిన్, సైదయ్య, నాగరాజు ఇంద్రారెడ్డి, అనిల్, పాఠశాల ఉపాధ్యాయినిలు కవిత, సరిత, క్రాంతి, ప్రసన్న జ్యోతి, అనంతలక్ష్మి, మానస, మనీషా, మాధవి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.