భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 373 దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్‌కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, ఆర్‌డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్ని మండలాల తహసీల్దారులు పాల్గొన్నారు. ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్‌లలో నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడం వల్ల సమస్యల పరిష్కారం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన దరఖాస్తుల్లో అడంగల్ సవరణలు – 106, చుక్కల భూములు, 22-ఎ భూములు – 65, అసైన్డ్ భూములు, భూఆక్రమణలు – 65, సర్వే, రీ-సర్వే – 63, ఆర్‌ఓఆర్, రెవెన్యూ కోర్టు కేసులు – 33, దేవాదాయ, వక్ఫ్ భూములు – 32, గ్రామ/వార్డు సచివాలయ సేవలు – 9గా ఉన్నట్లు తెలిపారు. స్వీకరించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి రెవెన్యూ క్లినిక్స్‌ను కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్పష్టం చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్