భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్, కరపత్రికలు, స్టిక్కర్ లను ఆయన ఆవిష్కరించారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను వనపర్తి జిల్లాలో అత్యంత సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా రోడ్డు రవాణా అధికారులతో కలిసి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన గోడ పత్రికలు, కర దీపికలు, స్టిక్కర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం సవ్యంగా నిర్వహించాలని సూచించారు. రోజుకో కార్యక్రమం చొప్పున ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, యువత, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆటోడ్రైవర్లు, లారీడ్రైవర్లు, పాఠశాలల మేనేజ్మెంట్ బస్సు డ్రైవర్లకు రోజుకొక సంఘం వారిగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 8న కలెక్టరేట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి లఘు నాటికలు ఏర్పాటుకు ప్రణాళికలు చేశారు. జనవరి 9వ తేదీన జిల్లాలోని అందరు లారీ డ్రైవర్లకు, 13న ఆటో డ్రైవర్లకు, జనవరి 19న తుఫాన్, ఇతర లైట్ గూడ్స్ వెహికిల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, చికిత్స క్యాంప్ లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ద్విచక్ర వాహన దారులకు హెల్మెంట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల పై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించి అవగాహన సదస్సులు విజయవంతం చేయాలని కలెక్టర్ రోడ్డు రవాణ అధికారిని ఆదేశించారు. జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, వెహికిల్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.