Andhrapradesh: ఏపీలోని ఆ నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు
భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్‌లోని 5 నగరాలు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాలు ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. వైజాగ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డులను ప్రకటించింది కేంద్రం.
జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, స్థిరమైన పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ నగరాలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.
ఇకపోతే విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడంతో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలో పరిశుభ్రతపై అవగాహనను మరింత పెంచేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.