భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పెరుమాండ్ల చక్రధర్‌కు ఫస్ట్ ఫ్రైజ్

e3daad94-0599-4cd5-ada2-97d056b3690c

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల 6వ తరగతి విద్యార్థి పెరుమాండ్ల చక్రధర్ స్టేట్ ఫస్ట్ విజేతగా నిలిచాడు. గత నవంబర్ నెలలోనే చక్రధర్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వడంతోపాటు తన సైన్స్ ప్రాజెక్ట్‌తో న్యాయనిర్ణేతల బృందాన్ని ఆకట్టుకుని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థి చక్రధర్‌కు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, స్థానిక ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సరైన బస్సు సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామం బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయిలో కార్పొరేట్, మోడల్ స్కూల్ తదితర స్టూడెంట్స్ తో పోటీపడి టాలెంట్ కనబరచి స్టేట్ ఫస్ట్ సాధించడం వెనుక ఆ పాఠశాల హెచ్‌ఎం, గైడ్ టీచర్ ఎం.వెంకటేష్ కృషి ఎంతో ఉంది.

 

చక్రధర్ విజయం.. పాఠశాలకు గర్వకారణం: హెచ్‌ఎం
ఈ విజయం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని గైడ్ టీచర్, హెచ్ఎం ఎం.వెంకటేష్ తెలిపారు. చక్రధర్ రాష్ట్రస్థాయిలో సాధించిన విజయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని, భవిష్యత్ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

 

చక్రధర్‌కు ప్రజాప్రతినిధుల అభినందన:
చక్రధర్‌ను గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తోపాటు ఏఏపీసీ చైర్మన్ తాళ్ల సునీత, ఉపాధ్యాయ బృందం సాయి, అశోక్, యాకుబ్ రెడ్డి, అనిల్, సంపత్ లు గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే చక్రధర్‌కు ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.