భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

మంత్రివర్గ నిర్ణయంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హర్షం

fa97952b-c609-4c7f-ae15-356bb63fe1e8

భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఎమ్మెల్యే అమర్ ఆనందం వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫామ్ వద్ద అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బుధవారం ఆనందం వ్యక్తం చేశారు. ఆ మేరకు విజయవాడలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఇక్కడి మోడల్ మార్కెట్ ఏర్పాటుకు 33 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందిస్తూ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.. పలమనేరు పరిసర ప్రాంత రైతుల అవసరాల దృష్ట్యా పట్టణ సమీపంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు 2018లోనే ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. 2019 ఎన్నికల అనంతరం గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు అడుగైన ముందుకు పడలేదన్నారు. దీంతో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మోడల్ మార్కెట్ ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్ ఏర్పాటుకు పశుసంవర్ధక శాఖకు చెందిన 50 ఎకరాల స్థలం అగ్రికల్చర్ మార్కెట్ శాఖకు కేటాయించాలని ప్రభుత్వానికి అభ్యర్థించడం జరిగింది అన్నారు.

 

 

అయితే పశు సంవర్ధక శాఖ మంత్రి తో పాటు ఉన్నతాధికారులు దీనిపై రెండు దఫాలు సమావేశం నిర్వహించి 33 ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు వీలు ఉంటుందని తెలియజేశారని పేర్కొన్నారు. ఇందుకు గాను ఆ శాఖకు రూ 1.45 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారన్నారు. ఏడాది ఏడాదిన్నర కాలంలో ఈ తంతును పూర్తి చేసి ప్రస్తుతం క్యాబినెట్ ఆమోదం కోసం పంపగా మంత్రివర్గం ఆ స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రివర్గ నిర్ణయంతో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగాయని దీంతో ఇక్కడి రైతన్నల పంటలకు గిట్టుబాటు ధర లభించడమే గాక వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరించారు. మరోవైపు వ్యాపారస్తులు ఇక్కడి ఉత్పత్తులను చెన్నై- బెంగళూరు తో పాటు ఇతర ముఖ్య నగరాలకు తరలించుకునేందుకు వీలుగా రోడ్డు రవాణా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు కుప్పం వద్ద కార్గో సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటన్నింటి కారణంగా భవిష్యత్తులో పలమనేరు ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. తమ అభ్యర్థన మేరకు 33 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అతి త్వరలో మార్కెట్ పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.