భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి రంగం సిద్ధమైంది. స్థానిక ఎం.ఆర్.సి కన్వెన్షన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎస్. సవిత, టి.జి. భరత్‌లను ఆహ్వానించారు. ఈ మేరకు కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, మంత్రాలయం నియోజకవర్గ నాయకులతో కలిసి ఏపీ సెక్రటేరియట్లో మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి విచ్చేయాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని, మంత్రులతో పలు రాజకీయ అంశాలపై చర్చించారు.