భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: బొందిమడుగుల గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తుల దాడికి గురై మృతి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ నేత బొందిమడుగుల టీఎం.రమేష్ మాదిగ హత్యను ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ దండోరా, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు పంపించాలంటూ తహసీల్దార్ నిజాముద్దీన్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ నిరసనకు సీనియర్ దళిత నాయకులు చిదానంద, ఎమ్మార్పీఎస్ దండోరా ఆదోని డివిజన్ అధ్యక్షుడు పంచగుండగ వెంకటేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూగూరు కెంచప్ప, అంబేద్కర్‌వాది నాయకుడు కన్నారావు, బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ తదితరులు నాయకత్వం వహించారు.
నాయకులు మాట్లాడుతూ… దళితుల హక్కుల కోసం పోరాడే బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని అగ్రవర్ణాల కుల అహంకారంతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో దళిత నేతలపై వరుస హత్యలు జరగడం దళిత సమాజంపై జరిగిన ఘోర దాడిగా అభివర్ణించారు. ఒక్క బొందిమడుగుల రమేష్ మాదిగను చంపితే వందమంది రమేష్ మాదిగలు పుట్టుకొస్తారని హెచ్చరించారు. దళితులపై దాడులు, హత్యల విషయంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనలపై జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్లు జిల్లాలో పర్యటించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రమేష్ మాదిగ హత్యకు ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులకు బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు మహదేవుడు, ఎమ్మార్పీఎస్ హోలగుంద మండల కన్వీనర్ కోగిలతోట వీరేష్, గోవర్ధన్, చిన్నహ్యట ప్రకాష్, ముద్దటమాగి నాగేంద్ర, వై.రంగప్ప, హనుమంతు, మల్లయ్య, మల్లికార్జున, మృత్యుంజయ, శివి, సిద్ధ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.