భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తాగునీటి అవసరాల కోసం వెళుతున్న ప్రజలను దారి పొడవునా రాళ్ళు పెట్టి అడ్డుకుంటూ, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు బెజ్జికల్లుకు చెందిన పోలె నరసయ్య. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్లుకు చెందిన సదరు వ్యక్తి, గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ వాసులను మంచినీళ్లు తెచ్చుకునే చేతి పంపు బోరింగ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని ఈ దారి నాది ఇక్కడ నుంచి ఎవరూ వెళ్ళవద్దు అని అసభ్యకరమైన బూతులు తిడుతూ బజార్లో రాళ్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై, గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు అని సదరు గ్రామస్థులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.