భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: ఇటీవల యువకులు పెళ్లి అంటేనే ఆమడదూరంలో ఉంటున్నారు. సింగిల్ లైఫ్ సో బెటర్ అనే వారి సంఖ్య రోజురోజుకు దేశంలో పెరిగిపోతుంది. మరోవైపు మరికొంతమంది మాత్రం రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ పెళ్లికాని వారికి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని అమేథీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అతడి ప్రాణం మీదికి తెచ్చింది. రెండో భార్య మత్తుమందు కలిపి దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది.
మత్తుమందు కలిపి పురుషాంగాన్ని కోసేసింది:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగల్గంజ్ గ్రామానికి చెందిన అన్సార్ అలీ 2011లోవివాహం చేసుకున్నాడు. మార్చి 2025లో తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇద్దరీ భార్యలకు తెలియడంతో ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో అన్సార్ తన రెండో భార్యతో కలిసి గ్రామంలో మరో ఇంట్లో నివసిస్తున్నాడు. రెండో భార్య నజ్ని బానో మొదటి భార్యతో అతను మాట్లాడడం, సంబంధం కొనసాగించడంపై కోపంగా ఉండేది. అన్సార్ అలీ తన మొదటి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ.. తాను రెండో పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ విషయం విన్న నజ్ని బానో కోపం కట్టలు తెంచుకుంది. తన భర్తకు ఆహారంలో మత్తుమందు కలిపింది. అన్సార్ అలీ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత, అతనిపై కత్తితో దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత అతడిని పలుసార్లు పొడిచి పారిపోయింది. అన్సార్ అరుపులు విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజ్ని బానోను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.