భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో గంజాయి మహమ్మారిని రూపుమాపేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి కాచికల్ క్రాస్ రోడ్ వద్ద ఎస్సై చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వీరికి గంజాయి విక్రయించిన నెల్లికుదురుకు చెందిన సందీప్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మాదకద్రవ్యాల సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై పేర్కొన్నారు.