గీతం విద్యార్థులకు సైబర్ నిపుణుల సూచన
సైబర్ అవగాహనపై చైతన్యపరచేలా శిక్షణ
భారత్ సమాచార్, సంగారెడ్డి: సైబర్ నేరాలను నివారించడానికి అవసరమైన జ్జానాన్ని సమకూర్చుకుని, అవగాహనతో డిజిటల్ మోసాలని అధిగమించాలని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైబర్ నిపుణులు సూచించారు. సైబర్ భద్రతపై మరింత అవగాహనను సమాజంలో వ్యాప్తిచేయగల బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలని అభిలషించారు. గీతంలోని సైబర్ స్పేసుపై అవగాహన, బాధ్యతాయుతమైన కార్యక్రమం (స్పార్క్ క్లబ్) విద్యార్థుల కోసం ‘సైబర్ అవగాహన, చైతన్య సదస్సు’ను సోమవారం నిర్వహించారు. దీనిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, న్యూఢిల్లీకి చెందిన ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్), సైబరాబాదుకు చెందిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ స్వల్ప వ్యవధి శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎస్.వి.హరికృష్ణ, సంగారెడ్డి డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సీఎస్సీకి చెందిన రష్మి శ్రీవాస్తవ, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్)కు చెందిన శాలిని రాథోర్, శిఖర్ ద్వివేది వంటి నిపుణులు పాల్గొని, సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించారు. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటంపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ, ఆసక్తికరమైన, ప్రయోగాత్మక శిక్షణా కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.
బాధ్యతాయుతమైన ఆన్ లైన్ ప్రవర్తనను నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఎలాంటి హానికరమైన లేదా అనైతిక డిజిటల్ కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఏదైనా ఆన్ లైన్ మోసం జరిగిన వెంటనే సైబర్ నేరాల జాతీయ హెల్ప్ లైన్ 1930లో కానీ, లేదా cybercrime.gov.in ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, సైబర్ పరిశుభ్రతపై అవగాహన, పాస్ వర్డ్ నిర్వహణ, ప్రామాణీకరణ ఉత్తమ పద్ధతులు, ఈ-మెయిల్, మెసేజింగ్, సోషల్ మీడియా ప్లాట్ ఫారాల సురక్షిత వినియోగం వంటి కీలక అంశాలను సృజిస్తూ, ‘సైబర్ హైజీన్ ఇంటర్న షిప్ ప్రోగ్రామ్’ను నిర్వహించారు. స్కార్క్ క్లబ్ ద్వారా తమ సమాజాలలో సైబర్ అవగాహనను వ్యాప్తిచేయడంలో చురుకుగా పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించారు.
పరిశ్రమ నిపుణుల నుంచి నేరుగా నేర్చుకునే ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గీతం కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రజోపయోగం కోసం ఉమ్మడి కార్యక్రమాలకు గల మార్గాలను అన్వేషించడానికి గీతం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ లను సందర్శించాలని నిపుణులను సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా ఆహ్వానించారు.
ఈ కార్యశాలను కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాధిపతి డాక్టర్ వి.శిరీష నిర్వహించగా, అదే విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.శశివర్ధన్ సమన్వయం చేశారు.