భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పటాన్‌చెరు పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న కల్తీ అల్లం పేస్ట్ దందాను పోలీసులు రట్టు చేశారు. శేర్ లింగంపల్లి ఎస్ఓటీ, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ నిల్వలను పట్టుకున్నారు. ఈ సోదాల్లో 535 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు, సుమారు 900 కేజీల అల్లం పొట్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు మురిగిపోయిన అల్లం, ఎల్లిపాయ పొట్టు, ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించి ఈ కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ముంబైకి చెందిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది కాలంగా అస్లాం ఇక్కడ రహస్యంగా ఈ కల్తీ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.