భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: “వేగం కన్నా ప్రాణం ముఖ్యం.. మీరు ఇంటి నుంచి ఎంత సురక్షితంగా వెళ్తారో, అంతే భద్రంగా తిరిగి రావడమే మా లక్ష్యం” అని ఎస్సై కరుణాకర్ పిలుపునిచ్చారు. చిన్ననాగారం గ్రామంలో గురువారం వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించి, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాటలకు ప్రభావితమైన గీత కార్మికుడు మేడగోని శ్రీను వెంటనే హెల్మెట్ ధరించి తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవాలని ఎస్సై సూచించారు. నిబంధనల అతిక్రమణపై కఠినంగా ఉంటామని స్పష్టం చేస్తూనే, గ్రామంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, కాంగ్రెస్ జిల్లా నేత బైరు అశోక్ గౌడ్, శ్రీనివాస్, సందీప్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.