భారత్ సమాచార్, మెదక్ జిల్లా: “ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం ఆ ఆటవిక కాలం నాటి పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాయి” అని మెల్లూరు గ్రామ పంచాయతీ శివారులోని పిట్టల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా తమకు కనీసం ఇందిరమ్మ ఇల్లు గానీ, ఇండ్ల వరకు రహదారి గానీ నిర్మించలేదని వారు ఆరోపించారు. అడవిలో దొరికే పిట్టలు, పండ్లు అమ్ముకుంటూ పొట్ట గడుపుతున్నామని.. ప్రస్తుతం కోతుల బెడద వల్ల ఆ ఆధారం కూడా పోయిందని కన్నీరుమున్నీరయ్యారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు, గెలిచాక తమను పట్టించుకోవడం లేదని వారు పత్రికా ముఖంగా మొరపెట్టుకున్నారు. ఈ సమస్యపై సర్పంచ్ రంగారెడ్డి స్పందిస్తూ.. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ తరఫున వారికి అండగా ఉంటామని, ప్రభుత్వం రహదారులు, గృహ నిర్మాణాలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు.