భారత్ సమాచార్.నెట్, నల్గొండ: త్రిపురారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రై కార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక సర్పంచ్ బైరం లక్ష్మి కృష్ణతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ నాయక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని, భారత రాజ్యాంగం ద్వారా యావత్ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహోన్నత శక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భారతి భాస్కర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు దస్తగిరి, మాజీ ఎంపీపీ పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షులు మడుపు శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కిట్టు మహారాజ్, జొన్నలగడ్డ నరేష్, చిత్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు.