భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు, పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కుండపోత వర్షం.. మొత్తం జలదిగ్భంధం:
అతి భారీ వర్షాలతో కామారెడ్డి పట్టణంలో వరద నీరుపోటెత్తింది. దీంతో కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. వరద ఉధృతి నేపథ్యంలో జాతీయ రహదారిని 44 తాత్కాలికంగా మూసివేశారు. కామారెడ్డి – భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద నుంచి వరద నీరు పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు విద్యాసంస్థలకు నేడు సెలవు దినంగా ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షలను సైతం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న వాహనదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారాలు పంపిణీ చేస్తున్నారు.
మరిన్ని కథనాలు:
వరంగల్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం