భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఈ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి జిల్లా మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
నిలిచిపోయిన రాకపోకలు
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీ వర్షంగా మారి, నగరాన్ని జలమయం చేసింది. భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ జగదీష్ హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని కథనాలు
రానున్న 48 గంటల్లో జిల్లాకు భారీ వర్షసూచన