భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2025, ఆదివారంభారత్ సమాచార్

’50ఏళ్లలో ఎప్పుడు ఇంతలా రాలేదు’

0f7345c5-1cd5-477d-9684-e642fc013612

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువడంతో మెదక్ జిల్లాలో భారీ నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట, నిజాంపేట్ మండలాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ ముందుగా రామాయంపేట నుంచి సిద్దిపేట్ వెళ్లే జాతీయ రహదారి, నిజాంపేట్ మండలంలోని బ్రిడ్జి డామేజ్ ను పరిశీలించారు. అనంతరం,నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలోని ప్రవాహానికి కొట్టుకుపోయిన రెండు బ్రిడ్జిలను, నిజాంపేట్ నుంచి నస్కల్ వెళ్లి దారిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పురాతన బ్రిడ్జ్ లను రెవిన్యూ, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని చెరువును, పర్వతాపూర్ వెళ్లే దారిలో వరద ప్రభావానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు.

తాత్కాలిక మరమ్మతు పనులతో రవాణా పునఃరుద్దరణ:
వర్షాలు వరదలతో కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు వంతెనలను అధికారులతో కలిసి పరిశీలించి తాత్కాలిక మరమ్మతు పనులతో రవాణాను పునఃరుద్ధరించే దిశగా అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆయా శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని చెప్పారు. తాత్కాలికంగా రవాణాను పునఃరుద్ధరించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేసి, అనంతరం శాశ్వత‌ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేసి అందించాలని సూచించినట్లు చెప్పారు.
పంట నష్టానికి సంబంధించి కొన్నిచోట్ల పంట పొలాలు నీటిలో మునిగాయని, కొన్ని ప్రాంతాలలో ఇసుక మేటలు వేశాయని, వ్యవసాయానికి సంబంధించి మండల వ్యవసాయ అధికారులు అంచనాలు వేస్తున్నారని అన్నారు.

50ఏళ్లలో ఎప్పుడు ఇంతలా రాలేదు:
130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన అహర్నిశలు శ్రమించి విద్యుత్‌ను పునఃరుద్ధరించినట్లు తెలిపారు. కొన్నిచోట్ల మిషన్ భగీరథ పైపులను కట్ ఆఫ్ అయిందని, తాగునీటి సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరమ్మతులు చేపట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసామన్నారు. 50సంవత్సరాలలో ఇంత పెద్దఎత్తున ప్రకృతి విలయతాండవం చూడలేదని గ్రామాల పెద్దలు చెప్పారన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన ధీటుగా ఎదుర్కొనేందుకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. రామాయంపేట పరిధిలో కాట్రియాల చెరువును పరిశీలిస్తూ చెరువు కట్టను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. చెరువు‌ కట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల్లో ఉంచామన్నారు. కాట్రియాల నుంచి పర్వతాపూర్ వెళ్లే రహదారి వరద ప్రవాహానికి వంతెన, విద్యుత్ వైర్లు కొట్టుకుపోవడం వల్ల పునఃరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ నుంచి సహాయ సహకారాలు అందుతాయని, ఎవరూ ఆందోళన పడవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్ రజని, నిజాంపేట్ తహసీల్దార్, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాలు:

భారీ వ‌ర్షాలు.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గామాత‌ ఆలయం