భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

వరంగల్ అడవుల్లో 763 కిలోల గంజాయి పట్టివేత

03

భార‌త్ స‌మాచార్.నెట్, వరంగల్: ఖానాపురం మండల అడవుల్లో దాచిపెట్టిన 763 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ భారీ పట్టుదల వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.3.81 కోట్లు ఉంటుందని తెలిపారు. సీపీ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన భూక్య సాయికుమార్, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లికి చెందిన అందాల పాండురెడ్డి, ఒడిశా రాష్ట్రంలోని మల్కనిరి జిల్లా కలిమెలకు చెందిన గుల్లారి మునిరాజ్, చిత్రకొండ మండలం పాపలూరుకు చెందిన కొప్పు కోటయ్య, గుర్రలూరుకు చెందిన రమేశ్, గిల్లమడుగుకు చెందిన మజ్జి కృష్ణ, నాయిని రమేశ్, బీదర్‌కు చెందిన ప్రకాశ్ ముఠాగా ఏర్పడి ఈ గంజాయి దందా నిర్వహిస్తున్నారు.

గత నెల 28న ఏపీ, ఒడిశా సరిహద్దులో గంజాయిని సేకరించి ట్రాలీ ఆటోలో వరంగల్‌కు బయలుదేరగా, నర్సంపేట పట్టణ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండటం గమనించారు. దీంతో వారు ఆటోను చిలుకమ్మనగర్ గుట్ట సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గంజాయిని అన్‌లోడ్ చేసి కవర్ కప్పి దాచిపెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, గంజాయిని తరలించడానికి ప్రయత్నిస్తున్న మునిరాజ్, కోటయ్య, మజ్జి కృష్ణతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గంజాయి, నిందితులను పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్, ఆరి శివకేశవులు, ఏఏవో సల్మాన్ పాషా, ఆర్‌లు పూర్ణచందర్, మనోజ్, నాగరాజును సీపీ అభినందించారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

దారుణం.. అదనపు కట్నం కోసం భార్య హత్య