భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించి కన్న కూతురు, భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం భర్తను, ఆగస్టు 2న 22ఏళ్ల కూతురును చంపేసిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
గత నెల 28న కాటారం మండలం కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఓ యువతి మృతదేహం లభ్యమైంది. చుట్టుపక్కల క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన యువతి చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణి (22)గా గుర్తించారు. అదే నెల 6న తన కూతురు కనిపించడం లేదని వర్షిణి తల్లి కప్పల కవిత చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కవిత తన ప్రియుడు జంజర్ల రాజ్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని విచారించగా తామే ఈ హత్యలు చేసినట్లు అంగీకరించారు. పక్షవాతంతో ఇంటికే పరిమితమైన భర్త కప్పల కుమారస్వామిని గత జూన్ 25న చంపేసి, అనారోగ్యంతో చనిపోయాడని బంధువులను నమ్మించారు. అయితే ఈ విషయంపై అనుమానం వచ్చిన కూతురు వర్షిణి తల్లిని నిలదీసింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని, ప్రియుడితో కలిసి వర్షిణిని ఆగస్టు 2న అర్ధరాత్రి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని మరోచోట పడేసి, క్షుద్ర పూజల నాటకం అల్లినట్లు వెల్లడించారు. ఈ కేసును కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై ఆకుల శ్రీనివాస్ బృందం ఛేదించింది.
మరిన్ని కథనాలు
సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం