భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై ఆరోపణలు: శేఖర్ రెడ్డి

WhatsApp Image 2026-04-24 at 4.11.44 PM

భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీలు కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మెండోరా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెండోరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చే సుమారు రూ. 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని.. 21 పంప్ హౌస్‌లు, 15 సబ్‌స్టేషన్లు, భారీ రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, కాలువలతో కూడిన అద్భుత నిర్మాణమని గుర్తుచేశారు.

ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం (రివర్స్ పంపింగ్) వల్లనే ఇటీవల బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎండిపోతున్న పంటలను కాపాడుకోగలిగామని శేఖర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రైతులకు నీరు అందిందని, కాళేశ్వరం లేకుంటే వరద కాలువలోకి నీళ్లు ఎక్కడి నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులను ఆలస్యం చేస్తూ ప్రాజెక్టును నిరుపయోగం చేస్తున్నారని మండిపడ్డారు.

నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మెండోరా మండల బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, ఎస్సీ సెల్ మండల నాయకుడు కమలాకర్, పోచంపాడ్ సర్పంచ్ బాబా, మాజీ సొసైటీ చైర్మెన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మెండోరా గ్రామశాఖ అధ్యక్షుడు మిట్టపల్లి మోహన్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.