భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, ఏప్రిల్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

WhatsApp Image 2026-04-25 at 5.29.32 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని కాచికల్, రామన్నగూడెం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచులు ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి, బండి శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం నరేంద్ర కుమార్ సంయుక్తంగా ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు. ఐకేపీ కేంద్రాల్లో విక్రయించడం వల్ల తూకంలో మోసాలు జరగవని, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు ధాన్యాన్ని తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా, సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు చీకటి జగదీష్ గౌడ్, ఏఈవోలు, సీసీ సోమయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు.