భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్

పాల్వంచలో ఘనంగా వాసవి జయంతి

WhatsApp Image 2026-04-26 at 9.29.48 PM

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని శ్రీ లలిత కామేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతుల పుత్రికగా జన్మించి, ఆత్మగౌరవం కోసం 102 గోత్రాల వారితో కలిసి అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి వాసవి మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి 50 కేజీల మల్లెపూలతో విశేష పూలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఆర్యవైశ్య జిల్లా నాయకురాలు పెండ్యాల రోజాలక్ష్మి, మాలె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు భారీగా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం, ధర్మ రక్షణ కోసం అమ్మవారు చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ఆమె జీవితం నుండి నేటి తరం నిజాయితీ, త్యాగం వంటి విలువలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో చలవాది రాజ్యలక్ష్మి, చిల్లంచర్ల అనిత, తాటికొండ స్వప్న, బిందు, మణి, భారతితో పాటు ఆర్యవైశ్య సంఘ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.