భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, మే 2026, సోమవారంభారత్ సమాచార్

మెదక్‌లో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

WhatsApp Image 2026-05-03 at 7.08.34 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, బయోమెట్రిక్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 479 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 465 మంది హాజరయ్యారని, 14 మంది గైర్హాజరయ్యారని ఆయన వెల్లడించారు.
పరీక్షా సమయం ముగిసే వరకు విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇన్విజిలేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని, ప్రభుత్వ నిబంధనల మేరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం పటిష్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మణ్ బాబు, పరీక్షా కేంద్రం నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.