భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ ఫంక్షన్ హల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్యానశాఖ అధికారులు ఆయిల్ పామ్ పంటపై ప్రెజెంటేషన్ ఇచ్చి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు అర్జించడంతోపాటు మూడు సంవత్సరాల పాటు అంతర పంటలతో వ్యవసాయం సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తూ రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4200 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటలను వేసినట్లు ఆయన తెలిపారు. 20వేల ఎకరాల వరకు వరకు ఆయిల్ పామ్ పంటలను వేస్తె భవిష్యత్తులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా మన ప్రాంతంలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉందన్నారు. పంట మార్పిడితో రైతులు లాభాల బాట పడతారని, ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, రసాయనిక ఎరువులు, క్రిమి సంహరక మందులు వాడితే ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరమన్నారు. అనంతరం కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలు నాయక్, ఏడిఏలు వీణ, శ్రీనివాస్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి జావీద్ పాషా, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.