భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, మే 2026, బుధవారంభారత్ సమాచార్

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో పీ.రాజ్యలక్ష్మి దేవికి డాక్టరేట్

0dda5dd9-1ec0-4415-a55b-9be06dbcf2d3

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జీవక్రియ రుగ్మతల నిర్వహణలో గట్ మైక్రోబయోటా చికిత్సా సామర్థ్యంపై పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని పి.రాజ్యలక్ష్మీ దేవిని డాక్టరేట్ వరించింది. ‘ఎలుకలలో స్థూలకాయం, మధుమేహ చికిత్స కోసం ప్రోబయోటిక్స్ తో కలిపి స్వల్ప-శృంఖల కొవ్వు ఆమ్లాలు (షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఎస్సీఎఫ్ఏలు) పోషించే పాత్ర’ అనే శీర్షికతో ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అధ్యాపకుడు డాక్టర్ ఎం.విన్యాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

ఊబకాయం, టైప్ II మధుమేహాన్ని పరిష్కరించడంలో ఎస్పీఎఫ్ఏలు, ప్రోబయోటిక్స్ యొక్క ఆశాజనకమైన పాత్రను ఈ అధ్యయనం దృష్టి సారించినట్టు తెలియజేశారు. స్థిరపడిన ప్రయోగాత్మక నమూనాలను ఉపయోగించి, ఈ పరిశోధన శరీర బరువు, లిపిడ్ ప్రొఫైల్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లైసెమిక్ నియంత్రణతో సహా కీలక జీవక్రియ పారామితులను మిశ్రమ చికిత్స గణనీయంగా మెరుగుపరిచిందని నిరూపించిందన్నారు. హిస్టోలాజికల్ పరిశోధనలు కాలేయం, ప్యాంక్రియాటిక్ కణజాలాలలో మెరుగుదలలను మరింతగా నిర్ధారించాయని తెలిపారు.

 

ముఖ్యంగా, అధ్యయనం చేసిన ఎస్సీఎఫ్ఏలో ఒకటైన బ్యూటిరేట్, అత్యుత్తమ యాంటీడయాబెటిక్ కార్యాచరణను ప్రదర్శించిందన్నారు. మాలిక్యులర్ డాకింగ్ విశ్లేషణలో, ఇది లెప్టిన్, ఇన్సులిన్ రిసెప్టర్లు, న్యూరోపెప్టైడ్ వై రిసెప్టర్ల వంటి కీలక జీవక్రియ నియంత్రకాలతో బలంగా సంకర్షణ చెందుతుందని వెల్లడైనట్టు తెలియజేశారు. ఇది జీవక్రియ సంకేత మార్గాలలో దీని పాత్రను ప్రస్ఫుటీకరిస్తోందన్నారు.

 

ఈ పరిశోధనల ప్రకారం, ఎస్సీఎఫ్ఏలు, ముఖ్యంగా ప్రోబయోటిక్స్ తో కలిపి వాడినప్పుడు, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, సంబంధిత జీవక్రియ రుగ్మతలను నివారించడానికి, నిర్వహించడానికి చికిత్సా ఏజెంట్లుగా గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సూచిస్తున్నట్టు వెల్లడించారు. డాక్టర్ రాజ్యలక్ష్మీ దేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.