భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో సాగుతున్న ఉపాధి హామీ పనుల క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ యాకూబ్, ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సైదులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా కూలీలకు రోజుకు రూ. 600 వేతనం చెల్లించాలని, వేసవి తీవ్రత దృష్ట్యా నాలుగు గంటలు పని చేయాలనే నిబంధనను వెంటనే తొలగించాలని కోరారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరును మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని వారు హితవు పలికారు. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు నాగరాజు, ఐలయ్య, ఎల్లయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, నీలమ్మ, ఎల్లమ్మ, మంగమ్మ, పూలమ్మ, సంగీత, అనసూర్య, చంద్రయ్య, వీర ఝాన్సీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్