భారత్ సమాచార్.నెట్, నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బుర్రి సందీప్ అసాధారణ ప్రతిభను చాటారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో 538 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచిన సందీప్‌ను ఏకే (A.K) ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ శనివారం ఘనంగా సన్మానించారు. యాచారం గ్రామానికి స్వయంగా విచ్చేసిన అనిల్ కుమార్.. విద్యార్థిని అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రోత్సాహకంగా నగదు పారితోషికాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ మండల స్థాయిలోనే ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు సందీప్ గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ‘ఐఏఎస్’ అవ్వాలన్న తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బుర్రి ముత్తయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు కట్టెబోయిన మల్లేష్ యాదవ్, శీలం శేఖర్, నడ్డి సైదులు, కట్టెబోయిన సైదులు, రవి, శంకర్, కాంసాని పెద్ద నాగయ్య యాదవ్, కాంసాని అంజయ్య, పుట్ట విజయ్ ముదిరాజ్, మన్నెంకోటి, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు