భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: భార్య తనతో కలిసి ఉండటం లేదనే కక్షతో.. భార్యాపిల్లలతో పాటు అత్తమామలను ఒకేసారి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఒక కిరాతకుడి ఉదంతం హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అదనపు కట్నం వేధింపులకు తోడు కుటుంబ మొత్తాన్ని అంతం చేయాలని చూసిన నిందితుడు మన్నె నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు, దౌలాపూర్కు చెందిన లావణ్యతో 2018లో వివాహం జరిగింది. వీరికి నేత్ర, అవంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజు అదనపు కట్నం కోసం భార్యను, అత్తమామలైన మోహన్, నర్సమ్మలను నిరంతరం వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు భరించలేక లావణ్య పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి దౌలాపూర్ వచ్చిన నాగరాజు.. భార్య, పిల్లలు, అత్తమామలు ఇంట్లో పడుకుని ఉండటం గమనించి బయట నుండి గడియ పెట్టాడు. అనంతరం పక్కనే ఉన్న మరో గుడిసెకు నిప్పు పెట్టి, ఆ మంటల్లో ఈ ఇల్లు కూడా కాలిపోతుందని భావించి అక్కడి నుండి పరారయ్యాడు.
అయితే, అదే సమయంలో పక్క వీధిలో పెళ్లి వేడుక జరుగుతుండటంతో.. గుడిసె నుండి పొగ రావడం గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పక్క ఇంటికి బయట నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించి వెంటనే తలుపులు తీశారు. లోపల నిద్రిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చే లోపే లావణ్య తండ్రి (మామ) కాలికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు హత్నూర పోలీసులు కేసు నమోదు చేసి, క్షేత్రస్థాయిలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిరూపించదగిన ఆధారాలతో నాగరాజును అదుపులోకి తీసుకోగా తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.