భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తమ తండ్రి కొనుగోలు చేసి, ప్రస్తుతం తాము సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా తన పేరున రికార్డుల్లో ఎక్కించుకున్న రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు మాసాయిపేట తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోతన్పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య 1993లో సర్వే నెంబర్ 203లో 25 గుంటల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. అయితే, రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న బర్రె బాబు అనే దాయాది.. బాధితులకు తెలియకుండా ఆ భూమిని తన పేరున నమోదు చేయించుకున్నాడు.
దీనిపై విచారణ జరిపి, బర్రె బాబును సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేష్ మాదిగ, మండల ఎమ్మార్పీఎస్ బాస్కర్ మాదిగ, బాలు మాదిగ తదితరులు పాల్గొన్నారు. తహశీల్దార్ జ్ఞాన జ్యోతిని వివరణ కోరగా, పోతన్పల్లి గ్రామనికి చెందిన బర్రె సత్తయ్య భూవివాదంపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి, తమకు న్యాయం చేస్తామని తెలిపారు.