భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధి గాంచిన, దక్షిణ కాశీగా పిలవబడే ఏడుపాయల వనదుర్గా భవానీ మాత క్షేత్రం ప్రస్తుతం వివాదాలకు, అవినీతి ఆరోపణలకు నిలయంగా మారుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తులు సమర్పించే కానుకలు, మొక్కులు కొందరు స్వార్థపరుల పాలిట కాసుల వర్షం కురిపిస్తుండగా, సామాన్య భక్తులకు మాత్రం కనీస వసతులు లేక కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇటీవల ఆలయ ఏఈవో నియామకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇతర ప్రముఖ ఆలయాల్లో పనిచేస్తూ, నిధుల దుర్వినియోగం, సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ఎదుర్కొంటున్న వివాదాస్పద అధికారులను ఈ పవిత్ర క్షేత్రానికి తీసుకురావడం వెనుక అంతర్యం ఏమిటని భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతోనే ఇలాంటి నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు లడ్డూ ప్రసాదం, తలనీలాలు, వీఐపీ దర్శనాల టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున లెక్కల్లో చూపని అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
భక్తులు సమర్పించే మొక్కుబడి మేకలు, కోళ్లను ఆలయానికి రాకుండానే దారి మళ్లించి సొంత విందులకు వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా, సామాన్య భక్తులకు కనీస తాగునీరు, మరుగుదొడ్లు, వసతి గదుల సౌకర్యం కల్పించడంలో పాలకమండలి, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మొన్నటి వరదల్లో దెబ్బతిన్న కనీస షెడ్ల మరమ్మతులు కూడా సరిగ్గా సాగడం లేదు. గత కొన్నేళ్లుగా ఆలయ పాలకమండలి సభ్యుల మధ్య, అధికారుల మధ్య నిధుల పంపకాల్లో, వాటాల గొడవల్లో వస్తున్న తేడాల వల్లే ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అర్హత లేని సొంత బంధువులను ఆలయ విధుల్లోకి చేర్చుకోవడం, టెండర్లలో అవకతవకలకు పాల్పడటం వంటి చర్యలు అమ్మవారి పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ జోక్యానికి తావులేకుండా, ఏడుపాయల ఆలయ ఆదాయ-వ్యయాలపై ఉన్నత స్థాయి నిఘా విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతి అధికారులను తక్షణమే తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
30, మే 2026, శనివారంభారత్ సమాచార్