భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ ‘తపస్’ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఎంపీని కలిసి జిల్లా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం నాయకులు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక భవనం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతం వేర్వేరు పాఠశాలల్లో ఈ శిక్షణ తరగతులను తాత్కాలికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక శిక్షణా భవన సముదాయాన్ని మంజూరు చేయాలని ఎంపీని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం లో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, ఆంజనేయులు, మార్గం రాజు, కిషన్ పవర్, పాము సతీష్, నరేందర్, భిక్షపతి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.