భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇంటింటా, ఖాళీ ప్రదేశాలతో పాటు సాగు భూముల గెట్లపై విస్తృతంగా చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామ ఉపసర్పంచి మల్లం ఐలయ్య పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వివిధ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న ముప్పారంలో ఉపసర్పంచి ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి అవగాహన ప్రదర్శన నిర్వహించి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ సామగ్రి వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే సమస్త జీవుల మనుగడ సాధ్యమవుతుందని, మానవాళి ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు సాయికుమార్, శారద, చట్ల అనిల్, ఎల్లబోయిన పద్మ, ఆశా వర్కర్లు తాళ్లపెల్లి ఆదిలక్ష్మి, రామగిరి గీత, వీవోఏలు కవిత, రాధిక, గ్రామస్తులు పాల్గొన్నారు.