భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి శివారులోని ఎదులకుంట చెరువు కట్టను అక్రమంగా తవ్వి ఆక్రమించుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చీన్య తండాకు చెందిన జాటోత్ రామ్ జీ నాయక్ జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ అనిల్ కుమార్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు చెరువు కింద చీన్య తండావాసుల సాగు భూములు ఉన్నాయని తెలిపారు.
అయితే అదే తండాకు చెందిన ఇస్లావత్ శివరాం, సీతారాం అనే ఇద్దరు వ్యక్తులు చెరువు కట్టను అక్రమంగా తవ్వి, తమ సాగు భూముల్లో కలుపుకుంటూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల వర్షాకాలంలో చెరువు కట్ట తెగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తండా పెద్దలు వారించినా వారు ఖాతరు చేయడం లేదని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని రామ్ జీ నాయక్ విజ్ఞప్తి చేశారు.