భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

వంతెన, హెల్త్ సెంటర్ నిర్మించాలని సర్పంచ్ వినతి

WhatsApp Image 2026-06-10 at 7.14.05 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గుండంరాజుపల్లి గ్రామంలో బుధవారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ గునిగంటి కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు అపరిష్కృత సమస్యలను సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గుండంరాజుపల్లి-చిన్నగూడూరు ప్రధాన రహదారిపై జిన్నేల వాగు వద్ద వంతెన నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కమలాకర్ కోరారు. వంతెన పూర్తయితే రైతులు, ప్రయాణికులకు రవాణా కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో సబ్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అర్హులైన వారందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా పేదలకు అందేలా చూడాలని కోరారు.

అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ చూపుతున్న చొరవను అభినందిస్తూ, ప్రజల నుంచి వచ్చిన వినతులను ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, ఎస్సై కుశ్‌కుమార్, ఇరిగేషన్ డీఈ, ఎంపీడీవో సుజాత, ఎంపీవో రజిని, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ఉద్యానవన శాఖ అధికారి, పంచాయతీ కార్యదర్శి అశోక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.