భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

‘పెళ్లి చెడగొడతా’ అంటూ బెదిరింపు.. యువతి సూసైడ్

12

భారత్ సమాచార్.నెట్, విజయనగరం జిల్లా: గరివిడి మండలం తోండ్రంగి గ్రామంలో నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. గరివిడి ఎస్సై లోకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22)కు అదే గ్రామానికి చెందిన వివాహితుడు రాము నాయుడుతో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

కుటుంబ సభ్యులు అఖిలకు మరో యువకుడితో వివాహం నిశ్చయించి గురువారం నిశ్చితార్థం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాము నాయుడు ఆమెను తీవ్రంగా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తమ మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టి పెళ్లి చెడగొడతానని బెదిరించడంతో పాటు మంగళవారం ఆమెకు పురుగుల మందు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అఖిల పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.

యువతిని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఆ వాంగ్మూలం దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.