భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం రాష్ట్రంలోనే తొలి గ్రామంగా గ్రామైక్య మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి సీఆర్డీ ఉషారాణి వెల్లడించారు. గ్రామంలో పనిచేస్తున్న రెండు గ్రామైక్య మహిళా సంఘాల పరిధిలోని మొత్తం 34 స్వయం సహాయక మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సోషల్ ఆడిట్ ప్రక్రియను పద్ధతిగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మహిళా సంఘం ఆర్థిక లావాదేవీలు, రికార్డులు, నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అనంతరం ప్రత్యేక మహిళా గ్రామసభను నిర్వహించి, సోషల్ ఆడిట్లో గుర్తించిన అంశాలను సంఘ సభ్యుల ముందుంచి వివరంగా చర్చించారు.
సోషల్ ఆడిట్ ద్వారా గుర్తించిన లోపాలు, మెరుగుపరచాల్సిన అంశాలు, భవిష్యత్‌లో పాటించాల్సిన విధివిధానాలపై మహిళలకు సమగ్ర అవగాహన కల్పించినట్లు సీఆర్డీ ఉషారాణి తెలిపారు. మహిళా సంఘాల నిర్వహణలో పారదర్శకత పెంపొందించడం, సభ్యుల్లో బాధ్యతాయుతమైన వ్యవహారశైలిని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఇటువంటి సోషల్ ఆడిట్లు గ్రామీణ మహిళల సాధికారతకు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, జిల్లా స్థాయి అధికారి జాన్ కెనడీ, డీపీఎం, ఏపీఎం నరేందర్, సీసీలు వరలక్ష్మి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కానుకుంట గ్రామం సాధించిన ఈ విజయాన్ని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుని మహిళా సంఘాల నిర్వహణలో పారదర్శకత, సమర్థత పెంపొందించే దిశగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.